అక్షయ తృతీయ నాడు కొన్ని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావనంలోని బాంకే బిహారీ ఒకటి. ఇక్కడి ఆలయంలో నిత్యం అంటే ఒక్కరోజు మినహా ఏడాదంతా స్వామివారి పాదాలు వస్త్రాలతో కప్పబడి ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామివారి పాదదర్శనం ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువయ్యాడు. కన్నయ్య పాదాలు అక్షయ తృతీయ నాడు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి కన్నయ్య పాద దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి ఆలయానికి వస్తుంటారు.
బృందావనంలోని ఈ ఆలయంలో రాధాకృష్ణులు కొలువయ్యారు. ఈ మిశ్రమ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు ప్రతి రోజూ వస్తూ ఉంటారు. 1864లో బాంకే బిహారీ ఆలయ నిర్మాణం జరిగింది. బాంకేబిహారిని చిన్న పిల్లల రూపంలో పూజిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ తెల్లవారుజామున హారతి ఇవ్వరు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా గంటలు వేలాడదీయబడవు. ఒక్క శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మాత్రమే స్వామివారికి మంగళ హారతి ఇవ్వడం జరుతుంది. అలాగే బాంకే బిహారీ ఆలయంలో నిరంతర దర్శనం ఉండదు. ప్రతి ఐదు నిమిషాలకోసారి తెరలు వేస్తుంటారు. ఎందుకంటే.. దర్శనాలకు అంతరాయమివ్వకుంటే భక్తులతో కలిసి బంకే బిహారి వారి ఇళ్లకు వెళాడని భావిస్తారు కాబట్టి. ఇక ఇక్కడి కన్నయ్య ఏడాదికొకసారి అంటే శరద్ పూర్ణిమ సందర్భంగా మాత్రమే తన చేతుల్లో వేణువును పట్టుకుని ఉంటాడు.