కాశీ విశ్వనాథుడి ఆలయానికి 2 కి.మీ దూరంలో కొలువుదీరిన తిలబందేశ్వర్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి ఏటా ఈ శివలింగం పెరుగుతూనే ఉంటుంది. దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం. తిల బందేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివలింగం ఇలా పెరగడం గురించి భక్తులు అయితే ఇదంతా శివయ్య లీలగా చెప్పుకుంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం.. భౌగోళికంగా భూమి అడుగున ఉన్న పలకలు జరగడం వలన ఇలా శివలింగం పెరుగుతోందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన స్ఫష్టమైన ఆధారాలు, రుజువులు లేవు. దీంతో ఇది విశ్వనాథుని మహాత్యమేనని భక్తులు అంటున్నారు.

తిల బందేశ్వర్ మహాదేవ్ ఆలయం వాస్తు శిల్పం చూడచక్కగా.. అద్భుతంగా ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలు మలయాళీ కేరళ, దక్షిణ భారతదేశం, ఉత్తర భారత సంస్కృతుల మేళవింపుతో ఉంటాయి. గర్భాలయంలో అతి పెద్ద శివలింగం ఉంటుంది. దీనిని దర్శించుకున్న భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ స్వామి వారికి రోజుకు నాలుగు సార్లు మహా హారతి జరుగుతుంది. హారతి సమయంలో పెద్ద ఎత్తున భజనలు, వాయిద్యాలు, ధ్వనుల నడుమ హారతి వెలుగులో శివలింగాన్ని దర్శించడం ఒక జీవితకాలం మరపురాని అనుభూతిగా భక్తులు పేర్కొంటారు. ఆలయాన్ని శుభ్రంగా కడిగిన మీదటే ఇక్కడ హారతి నిర్వహిస్తారు.
