ద్వారపూడిలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి 1989లో ప్రతిష్టించగా.. ఓ తమిళ భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో ఉంటుంది. గర్భాలయంలో అయ్యప్ప స్వామి కొలువుదీరగా.. ఆలయ ప్రాంగణంలో హరిహరాదులకు ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. ఆలయ ముఖద్వారంలో శివకేశవులు, పశ్చిమ దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి. ఇక ఆలయ కింది భాగంలో దుర్గాదేవి కొలువుదీరింది. అలాగే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి, షిరిడీ సాయిబాబా, నవగ్రహాలయం ఉపాలయాలుగా ఉన్నాయి. అయ్యప్ప స్వామివారి ఆలయానికి తూర్పు వైపున 200 అడుగుల పొడవున సొరంగం తవ్వారు.

ఈ సొరంగంలో 40 అడుగుల లోతులో ద్వాదశ జ్యోతిర్లింగాలయం ఉంటుంది. ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్ాపలి. అలాగే అష్టాదశ ఉమాలింగేశ్వర ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. దీనిని పాలరాతితో మూడు అంతస్తులుగా నిర్మించారు. ఈ ఆలయంలో 18 శివలింగాలు ఉంటాయి. వాటిని రుషికేశ్, హరిద్వార్, కేదార్‌నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, అమర్నాథ్, కాశీ, యమునోత్రి, ఓంకార్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఆలయం వెలుపలకు వెళితే అక్కడ మనకు అతిపెద్ద నటశేఖరుడు, నందీశ్వరుని ప్రతిమలు కనిపిస్తాయి. ఇక శబరిమల తరహాలోనే ద్వారపూడి క్షేత్రంలోనూ 18 మెట్లు ఉంటాయి. వీటిని తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలతోనిర్మించారు.
