వినాయకుడు కొలువుదీరిన ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వెరీ స్పెషల్. అలాంటి రెండు ఆలయాల గురించి తెలుసుకుందాం. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడ గణపతి ఏకశిలా వినాయకునిగా దర్శనమిస్తాడు. ఎక్కడైనా వినాయకుడు మహా అయితే ఐదడుగుల ఎత్తు ఉంటాడు. కానీ ఇక్కడి గణేశుడు మాత్రం 30 అడుగుల ఎత్తు ఉంటాడు. ఈ గణపతిని ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలుస్తారు. దేశంలో ఇంత ఎత్తైన వినాయకుడి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. ఈ విగ్రహానికి సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దీనిని పశ్చిమ చాళుక్య రాజు ప్రతిష్టించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

వరంగల్ పట్టణం కాజీపేటలో వెలసిన మరో స్వయంభువు వినాయకుడి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడి గణపతి.. శ్వేతార్కమూల గణపతి. ఇలాంటి గణపతి దేశంలోనే చాలా అరుదు. తెల్ల జిల్లేడు చెట్టును శ్వేతార్కంగా పేర్కొంటారు. ఈ చెట్టును గణపతికి ప్రతి రూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడి శ్వేతార్క వృక్షానికి వందేళ్ల పైనే ఉంటుందకాజీపేటలోని గణపతి ఇలా శ్వేతార్క వృక్షం వేరులో వెలసిన గణనాథుడే కావడం విశేషం. ఇక్కడ గణపతి తూర్పు అభిముఖంగా కొలువుదీరి దర్శనమిస్తాడు. తనను ఆశ్రయించిన భక్తుల సమస్త కోరికలు నెరవేరుస్తాడని ప్రతీతి. ఈ వినాయకుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడటం మరో విశేషం. ఈ గణనాథుడి సన్నిధి బుధవారాల్లో, పర్వదినాల్లో, గణేష్ నవరాత్రుల్లో వేలాది భక్తులతో కిటకిటలాడుతుంది.
