యమ ధర్మరాజు, చిత్రగుప్తుడి గురించి పురాణాల ద్వారా తెలుసుకోవడమే తప్ప నిజానికి వారు ఇప్పటికీ మన తప్పొప్పుల లెక్కలు తేల్చి.. మన కర్మల ఆధారంగా మనల్ని స్వర్గానికో.. నరకానికో తీసుకెళతారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అదొక నమ్మకం మాత్రమే. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రాంత ప్రజలు మాత్రం యమధర్మరాజు తమ ఆలయంలో ఉంటాడని.. చిత్రగుప్తుల వారు మన లెక్కలన్నీ రాస్తారని నమ్ముతారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చౌరాసి దేవాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఇది. పురాతన కాలం నాటి శివాలయం అది. అందులో ఒక రహస్యమైన గది ఉందట. అది చిత్రగుప్తుని గది అని అక్కడి వారి నమ్మకం.
చౌరాసి ఆలయంలోనే చిత్రగుప్తుడ మన లెక్కలన్నీ తేలుస్తాడని స్థానికుల విశ్వాసం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఆలయంలో మన కంటికి కనిపించని బంగారం, వెండి, రాగి, ఇనుముతో తయారు చేసిన నాలుగు లోహపు తలుపులు ఉన్నాయని కూడా అక్కడి వారు నమ్ముతారు. యమ ధర్మరాజు ఇక్కడే ఉంటారని.. ఆయన ఆస్థానం కూడా జరుగుతూ ఉంటుందని విశ్వాసం. ఈ ఆస్థానంలోనే మనం స్వర్గానికి వెళ్లాలా? నరకానికి వెళ్లాలా? అనేది నిర్ణయించబడుతుందట. ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం.. జీవి మరణించగానే తొలుత దాని ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉంచుతారట. ఆయన ఆ జీవి చేసిన మంచి చెడు పనుల లెక్కలన్నీ తీస్తారట. అనంతరం యముడి ఆస్థానమని చెప్పే మరో గదికి ఆత్మను తీసుకెళతారట. అక్కడ స్వర్గమా.. నరకమా? అనేది నిర్ణయిస్తారట. ఇది చౌరాసి దేవాలయం కథ.