కాశీలో 2000 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిసిన తిలబందేశ్వర్ గురించి విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ స్వయంభువుగా తిల బందేశ్వర్ మహాదేవ్ వెలిశాడు. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ తిలబందేశ్వర్ ఆలయం.. కాశీ విశ్వనాథుని మందిరం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండా హవేలీలో బెంగాల్‌లో తోలా ఇంటర్ కాలేజీకి సమీపంలో వెలసి ఉంది. ప్రసిద్ధి చెందిన తిల బందేశ్వర్ మహాదేవ్ ఆలయంలో గర్భాలయంలో వెలసిన శివలింగం పరిమాణం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది.

మరి తిలబందేశ్వర్ పేరెలా వచ్చిందంటారా? శివలింగ పరిమాణం ప్రతి సంవత్సరం ‘తిల’ అంటే నువ్వు గింజంత పెరుగుతుందట. అందుకే ఇక్కడి శివయ్యను తిలబందేశ్వర్‌గా పిలుస్తారు. గర్భాలయంలోని శివలింగం అప్పట్లో చాలా చిన్నగా ఉండేదట. ఇప్పుడు గర్భాలయం మొత్తం ఆక్రమించినట్లుగా ఉండడం విశేషం. ఇక్కడ శివుడు వెలిసినప్పటి నుంచి అంటే దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఈ లింగం ఇలా పెరుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు లింగం బాగా విస్తరించి ఉంది. ప్రస్తుతం శివలింగం 3.5 అడుగుల ఎత్తు కాగా.. దాని పీఠం వ్యాసం సుమారు 3 అడుగులు.. లింగం పరిమాణం భూమి పైకి 20 అడుగులు ఉంటుంది.
