అప్పట్లో రాజులు ఈ రోజున ఏం చేసేవారంటే..

ఆశ్వయుజ శుక్లపక్షం తొమ్మిది రోజులనూ దసరా లేదా దేవీ నవరాత్రులు అంటారు. చివరి మూడు రోజులు ప్రత్యేకంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి అమ్మవారి కృపను పొందుతారు. పురాణాల్లో రాజులు దేవి మహిషాసురమర్దనిగా విజయం సాధించిన స్ఫూర్తితో ఈ రోజునే దండయాత్రలు ప్రారంభించేవారని చెప్పడం జరిగింది. దుర్గాష్టమి నాడు అమ్మవారు లోహుడు అనే రాక్షసుని సంహరించగా లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అని చెబుతారు.

“దుర్గ” అంటే – దుర్గతులను తొలగించేది. ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. ‘గ’ అంటే వాటిని నశింపచేసేది. అందుకే ఈరోజు దుర్గాసహస్రనామ పారాయణం, “దుం” బీజాక్షరంతో అమ్మవారి పూజ ప్రత్యేకం. ఈసారి దుర్గాష్టమి మంగళవారంతో కలవడంతో మరింత శ్రేష్టత ఉంది. నవరాత్రి దీక్షలో అత్యంత ముఖ్యమైన రోజు. ‘సిద్ధిదా’ అనే పేరుగల ఈ నవమి మంత్రసిద్ధిని ప్రసాదిస్తుంది. జపసంఖ్య పూర్తిచేసిన ఉపాసకులు ఈరోజు హోమాలు చేసి వ్రతాన్ని సమాప్తి చేస్తారు. క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు ఆయుధపూజలు చేసి, తల్లి కృపను పొందుతారు. భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చిన పవిత్రమైన ఘట్టం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెబుతాయి.

Share this post with your friends