శ్రీరాముడి గుణగణాల కారణంగా వచ్చిన పేర్లు చాలానే ఉన్నాయి. దశరథ తనయుడని.. ఏకపత్నీవ్రతుడని.. ఆయన్ను కీర్తిస్తూ ఉంటారు. శ్రీరామనవమి వస్తుందంటేనే కొద్ది రోజుల ముందు నుంచే ఆలయాల్లో కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. భారతదేశంలో ప్రతి ఊరులోనూ రాముల వారికి ఒక ఆలయం ఉంటుంది. చైత్రమాసం శుద్ద నవమి రోజున ప్రతి గ్రామంలోనూ రాముల వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. హిందూ మతంలో ముఖ్యంగా శ్రీరాముడికి ప్రత్యేక స్థానముంది.
ధర్మమును అనుసరించి పాలన సాగించిన రామయ్య నేటికీ పాలకులకు మార్గదర్శకుడు. ఈ ఏడాది 17వ తేదీన రాముల వారి కల్యాణం జరగనుంది. అయితే శ్రీరాముడిని ఆరాధించిన ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని మార్పులు వచ్చి తీరుతాయట. అవేంటంటే.. జీవితంలో నీతిగా.. నిజాయితీగా జీవించడం అలవాటవుతుంది. బాధలు, కష్టాలు వంటివన్నీ తొలిగిపోతాయి. మనసు ప్రశాంతంగా మారిపోతుంది. శ్రీరాముడి అనుగ్రహంతో జీవితం ధర్మబద్దంగా నడుస్తుంది. శ్రీరాముడిపై విశ్వాసముంచి ప్రశాంతమైన హృదయంతో ఆయనను ఆరాధిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుందని పెద్దలు చెబుతారు.