హిందువులు ముఖ్యంగా గణేశుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. పండగైనా, శుభకార్యమైనా ముందుగా గణపతిని పూజించుకుని మొదలు పెడతాం. అయితే కొందరు వినాయకుడిని తమ ఇంటి ప్రధాన ద్వారం తలుపు పైనో లేదంటే గడపకు పైనో పెట్టిస్తారు. ఇలా చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుడి బొమ్మను పెట్టడం వలన కుటుంబానికి వచ్చే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. పైగా ఇంట్లో ఏమైనా ఆర్థిక కష్టాలుంటే అవననీ తొలగిపోయి సంపద వస్తుందట. కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా వినాయకుడి విగ్రహాన్ని ఇంటిపై గుమ్మంపై పెట్టవచ్చట.
అలాగే మెయిన్ డోర్‌పై వినాయకుడి ఫోటోను చెక్కించడం వలన ఇంట్లోకి నెగెటివిటీ రాదట. ఇంట్లో గొడవలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ సమసిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందట. అలాగే ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోతాయట. తద్వారా ఇంట్లో పాజిటివిటీ నెలకొంటుందట. అలాగే మనం ఎప్పుడైనా ముఖ్యమైన పనులపై బయటకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరించుకుని వెళితే అడ్డంకులన్నీ తొలగిపోయి పని సజావుగా జరుగుతుందట. కాబట్టి వినాయకుడిని ఇంటి ప్రధాన ద్వారంపై పెట్టే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పండితులు చెబుతున్నారు.