తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా విమానాలు కానీ.. డ్రోన్స్ కానీ ఎగరడం నిషేధం. విమానాలు ఎగురకుండా చూడాలని ఇప్పటికే చాలా సార్లు తిరుమల ఆలయ అధికారులు ఏవియేషన్ అధికారులతో పాటు ఏవియేషన్ మంత్రిని కోరారు. కానీ ఫలితం శూన్యం. నిలువరించడం కష్టమని ఏవియేషన్ శాఖ తేల్చి చెప్పింది. పోనీ డ్రోన్స్ వంటివి అయినా ఎగుర వేయకుండా చూద్దామనుకుంటే అది కూడా అవడం లేదు. ఎవరో ఒకరు డ్రోన్‌ను ఎగురవేసి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ఓర్పును పరీక్షిస్తూనే ఉన్నారు.
తాజాగా కూడా ఓ వ్యక్తి శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం మీదుగా ఓ డ్రోన్ ఎగుర వేశారు. అతను ఎవరనేది కనిపెట్టి మరీ టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అను ఓ యూట్యూబర్. విషయాన్ని గుర్తించిన వెంటనే మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించింది. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.