తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం వెనుక లోతైన పురాణార్థం ఉంది. వేంకటాచల మహత్యం ప్రకారం శ్రీనివాసుని ఇల్లాలు పద్మావతి దేవి. ఆమెనే అలమేలుమంగ అని కూడా పిలుస్తారు. భృగు మహర్షి ఘటన తరువాత లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోవడంతో… శ్రీనివాసుడు 12 సంవత్సరాలు తిరుమల కొండల్లో తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి తిరుచానూరులో పద్మావతిగా అవతరించింది. అందుకే ముందుగా అమ్మవారిని దర్శించి మన కోరికలు, బాధలు ఆమెకు విన్నవించాలి. తరువాత శ్రీవారిని దర్శిస్తే… ఆయన వక్షస్థలంలో కొలువైన అమ్మ మన విన్నపాలను స్వామికి చేర్చుతుందనే నమ్మకం ఉంది. అలా అమ్మ–అయ్య దర్శనాలతోనే తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

