దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం

ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటిరోజు నుంచి మనకు కార్తిక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరుసంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై భాసిస్తుంటాయి. ఇటువంటి దీపసంప్రదాయాన్ని ముందుతరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2012 నుంచి భక్తిటీవీ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఏటా హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవ సంప్రదాయం కొనసాగుతోంది.

దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాలనుంచి దేవతామూర్తుల కల్యాణాలు వేదికపై నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలు వెలువరిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందిస్తున్నారు. అతిరథ మహారథులు అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాదిమంది ప్రజలు వెలిగించిన కోటిదీపాలు వెలుగుతుంటే భక్తకోటి తన్మయమవుతుంది. ఖండాంతరాలలో ఉన్న భక్తులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తూ పరవశించి మహాదేవునికి నీరాజనాలు పలుకుతారు. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు సమస్త పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరి ప్రశంసలూ అందుకుంటూ… కార్తికమాసం అంటేనే దేశంలో భక్తిటీవీ కోటిదీపోత్సవ మాసం అన్నంతగా దిగ్విజయంగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్ 14 నుంచి 30 వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా… ఈసారి నిర్వహించబోయే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి మీరందరూ సకుటుంబంగా తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరుతున్నాం.

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం

➠ సంచిత పాపాలను నివారించేది శివలింగమే. సర్వాన్ని పుట్టించి, తిరిగి తనలో లయం చేసుకునే లింగమే మనకు కలిగే దారిద్ర్యబాధలను కూడా నివారిస్తుంది. మన బుద్ధులను సరైన దిశగా నడిపించే శక్తి శివలింగానికి చేసిన నమస్కారానికి ఉంది. ఈ లింగాష్టకాన్ని మూడుసంధ్యలలోనూ శివుని సన్నిధిలో పఠించిన వారికి శివలోకం లభిస్తుందని ఫలశ్రుతి చెబుతోంది.

➠ కార్తికం సమైక్యతా స్ఫూర్తినిచ్చే మాసం. సామూహిక వ్రతాచరణలు, వనభోజనాలు, అభిషేక కార్యక్రమాలతో ప్రజలందరూ ఏదో ఒకచోట ఒక్కటిగా కలగలిసిపోతారు. మామూలు మనుషుల్లోనే కాదు దేవతల్లోనూ అభేదాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదించే పావన మాసం కార్తికం. అటువంటి కార్తికం మనకెన్నో ప్రయోజనాలు సిద్ధింపచేస్తోంది.

➠ దీపం పరబ్రహ్మ స్వరూపం. అది వెలుగుకు మూలం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, దుఃఖం నుంచి ఆనందానికి, నిరాశ లోంచి గట్టి ఆశాభావంలోకి చేరాలన్న మనిషి నిరంతర తపనకు దీప ప్రకాశనం ఒకానొక మంగళకరమైన ప్రతీకగా పెద్దలు భావించారు. ‘గోరంతదీపం కొండంత వెలుగు చివురంత ఆశ జగమంత వెలుగు’ అంటూ కవులు ధైర్యం చెప్పారంటే- దాన్ని గట్టిగా నమ్మబట్టే!

➠ పరమాత్మ ఒక్కడే. ఆయనకు అనంత నామాలున్నాయి. అనేక రూపభేదాలున్నాయి. ఎవరైనా సరే… ఇష్టదైవాన్ని ఆరాధించవచ్చు. శివుడైనా విష్ణువైనా భేదం పాటించనక్కర లేదు. ఒక్క పరమాత్మయే విభిన్న సందర్భాలలో విభిన్న రూపాలతో పూజలందుకుంటాడు అనే విశిష్ట సత్యాన్ని ఎరిగి మసలుకోవడం మంచిది.

➠ విభూతి సంపదలను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలను భస్మం చేస్తుంది. అరిష్టాలను తొలగించి శుభాలను చేకూరుస్తుంది. సర్వ సంపదలను ప్రసాదిస్తుంది. భూత ప్రేత పిశాచాది బాధలనుంచి రక్షిస్తుంది. తేజస్సును కలిగించడంతో పాటు పరంలో మోక్షాన్ని కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలను కలిగించే విభూతిని ఎప్పుడూ ధరించాలి.

➠ కేవలం చెంబుడు గంగతో అభిషేకం చేసినంతనే అక్షయ పుణ్యాన్ని ప్రసాదించే బోళామూర్తి ఈశ్వరుడు. అనంతమైన కాలస్వరూపుడైనా చేరవచ్చిన అందరినీ ఆదరించే పరమ దయాళువు రుద్రుడు. ఇంతటి సర్వోన్నత దైవాన్ని పూజించి, తరించటానికి సకల శాస్త్రాలు, ఆగమాలు నిర్దేశిస్తున్న అర్చనావిధానం – రుద్రాభిషేకం.

➠ శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు పోస్తే చాలు పరవశిస్తాడు. కానీ అంతకుముందుగా ఆయనపై ఒక్క మారేడు దళాన్నైనా సమర్పించాలని పెద్దలు చెబుతుంటారు. కార్తికమాసంలో ప్రత్యేకించి శివునికి బిల్వార్చన చేస్తారు. బిల్వార్చన వల్ల కలిగే విశేష ఫలితాలను ఎనిమిది శ్లోకాలు కల బిల్వాష్టకం మనకు వివరంగా తెలియచేస్తోంది.

➠ శివ అనే రెండక్షరాలకూ శుభము, మంగళమని అర్థాలున్నాయి. శివనామ మహిమను గురించి ఎంత రాసినా తక్కువే. శివనామాన్ని నాలుకపై ధరిస్తే సకల పాపాలనుంచి విముక్తులవుతారని చెప్పడం చాలా మామూలు విషయం. శివనామ మహిమను గురించి పురాణాలు విస్తరించి చెప్పాయి. ముఖ్యంగా శివపంచాక్షరీ మంత్రాన్ని మహామంత్రంగా స్వీకరించి సాధన చేస్తే సకల ప్రయోజనాలూ సిద్ధిస్తాయి.

➠ భక్తిటీవీ కోటిదీపోత్సవం ప్రతిరోజూ వేదఘోషతో ప్రారంభం అవుతుంది. అనంతరం సంగీత కార్యక్రమాలుంటాయి. దేశవిదేశాల్లో పేరెన్నికగన్న ఎందరో కళాకారులు భక్తిటీవీ కోటిదీపోత్సవ వేదికపై తమ గళాన్ని వినిపించారు. వాద్యగోష్టులతో భక్తుల మనస్సులను రంజింప చేశారు. కోటిదీపోత్సవ క్రతువు పూర్తయ్యే సమయానికి అంటే దీపాలు వెలిగించిన అనంతరం ఆ దీపాల వెలుగులో అనేక నృత్య కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ భారతీయ సంప్రదాయ నృత్యరీతుల్లో… ఔత్సాహికులు, గొప్ప కీర్తిని ఆర్జించిన కళాకారులెందరో ఈ వేదికపై నృత్య ప్రదర్శన చేసి, జనుల చేత జేజేలు పలికించుకున్నారు.

➠ భక్తిటీవీ కోటిదీపోత్సవ వేదికపై కొలువుదీరే ఉత్సవమూర్తులందరూ ఒక ఎత్తు… ఆ ప్రాంగణంలో భక్తిటీవీ యాజమాన్యం నెలకొల్పే కళారూపాలన్నీ ఒక ఎత్తు. ప్రాంగణమంతా విహరిస్తూ ఆనందాన్ని పొందే భక్తుల కోసం వివిధ శైలులతో కూడిన దేవతామూర్తుల కళారూపాల్ని అక్కడక్కడా నెలకొల్పి ఉంచుతుంటారు. అటువంటి కళారూపాల్లో వివిధ క్షేత్రాలలోని మూలవిరాట్టుల నమూనాలు, దేవాలయాల నమూనాలు చోటుచేసుకుంటాయి. ఆయా దేవస్థానాలనుంచి వచ్చిన ప్రచారరథాలు కూడా కోటిదీపోత్సవ ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం నిలిచి ఉంటాయి.

Share this post with your friends