
సర్వమానవకోటికి ముక్తి సాధనం కూర్చునవిగా ముక్తిప్రద తీర్థములను పేర్కొంటారు. ఇవి సర్వోత్కృష్టమైనవి. ఇవి మొత్తం ఏడు. అవేంటో తెలుసుకుందాం.
1. శ్రీస్వామి పుష్కరిణీ 2. కుమారధార 3. తుంబురు 4. రామకృష్ణ 5. ఆకాశగంగ 6. పాపవినాశనం 7. పాండవ తీర్థం. దీనికి గోగర్భమని నామంకూడా కలదు.
1. శ్రీస్వామి పుష్కరిణీ తీర్థము: శ్రీవారి ఆలయానికి ఈశాన్యదిశలో ఉండే ఈ తీర్థం సర్వోత్కృష్టమైనదిగా, తీర్థరాజంగా శ్లాఘించబడుతున్నది. సాధారణంగా శ్రీవారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో, రధసప్తమి తదితర సందర్భాల్లో ఈ తీర్థస్నానం శుభదాయకమని చెప్పుచున్నా, ధనుర్మాసంలో శుద్ధ ద్వాదశి దినమున సూర్యోదయమున ఆరుఘడియల కాలం సర్వోత్తమమైనదిగా పురాణ ప్రశస్తి.
2. కుమారధార: కుంభమాసమునందు మఖానక్షత్రంతో కూడిన పౌర్ణమి పర్వదినము.
3. తుంబురు: మీన మాసమందు ఉత్తర పాల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి అపరోహ్ణకాలం శుభదినం.
4. రామకృష్ణ: మకరమాస పుష్యమి నక్షత్రాయుత పౌర్ణమి.
5. ఆకాశగంగ: మేషమాస చిత్రానక్షత్రాయుత పౌర్ణమి.
6. పాపవినాశనం: ఆశ్వయుజ మాసమందు శుక్లపక్షమున ఉత్తరాఢ నక్షత్రాయుత సప్తమి ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాయుత ద్వాదశి.
7. పాండవ (గోగర్భం): వృషభమాసమందు శుద్ధ ద్వాదశి ఆదివారము లేదా బహుళ ద్వాదశి మంగళవారం ఉభయయాత్ర సంగమకాలం పర్వకాలము. సంగకాలమనగా ఉదయం 6 ఘడియల నుండి 12 ఘడియల వరకు.
కాగా పైన పేర్కొన్న ఈ తీర్థాలలో శ్రీస్వామి పుష్కరిణి, కుమాధార, తుంబురు, రామకృష్ణ తీర్థాలకు ప్రతి వత్సరం ముక్కోటి కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది.
