పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవారు.. ఒక బుధవారం నాడు లేదంటే చవితి తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఆ తరువాత ఇంటి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి.. ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి తోరణాలతో.. పూల మాలలతో అలంకరించాలి. గరిక అనేది వినాయకుడికి అత్యంత ప్రీతికరమని చెబుతారు. అందుకే ఈ వ్రతంలో భాగంగా గరిక పూజ చేస్తారు. దీనికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. గరిక ఎలాగైతే భూమిపై విస్తరిస్తుందో ఈ వ్రతం ఆచరించిన వారి వంశం కూడా అలాగే వృద్ధి చెందుతుందట.

గరికెను వినాయకుడి పాదాల వదద ఉంచిన మీదట దీపారాధన చేసి వినాయకునికి షోడశోపచార పూజలు చేయాల్సి ఉంటుంది. అనంతరం అష్టోత్తర, శత నామాలతో గణేశుని పూజించిన మీదట కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. ఆ తరువాత గణపతికి బాగా ఇష్టమై కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు, గారెలు, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలను నైవేద్యంగా నివేదించాలి. చివరగా గణేశుని మంగళహారతులు పాడుతూ కర్పూర నీరాజనం ఇవ్వడంతో పూజ పూర్తవుతుంది. గణపతి పూజ పూర్తయ్యాక పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. గణేశుని అనుగ్రహంతో సంతానాన్ని పొందిన కృతవీర్యుని కథ చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి.
