తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు.
అవసరమైన పనులే చేయండి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికీ ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఆ మార్పు 100 శాతం ఉండాలి. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దు…మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చుపెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండల వాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమలకు టీటీడీ ఖర్చు చేస్తోంది..దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు….కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ, విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబు దారీతనం ఉండాలి” అని స్పష్టం చేశారు. “టీటీడీలో సమూల ప్రక్షాళన జరపుతాను అని నేను ఎన్నికల ముందు చెప్పాను. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు 100 శాతం ఉండాలి. ఎక్కడా పాతవాసనలు, పాత వ్యక్తులు కొనసాగకూడదు. అనుభవజ్క్షుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించ వద్దు. ప్రక్షాళన అనేది 100 శాతం జరగాల్సిందే…దీనిలో మినహాయింపులు లేవు” అని చంద్రబాబు అధికారులకు సూచించారు.
అలిపిరిలో బేస్ క్యాంప్
సమీక్ష సందర్భంగా టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 25 వేల మందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు. శ్రీవారి సేవకుల విషయంలో కొత్తవారు 90 శాతం మంది ఉంటున్నారని అధికారులు చెప్పగా..సగం మంది పాతవారిని నియమించుకోవడం ద్వారా నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25 వేల మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు తెలపగా..దీనికి మరింత అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈవో, సివిఎస్‌వో, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్‌లో అందిస్తామని అధికారులు చెప్పగా…వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశుధ్య నిర్వహణపైనా దృష్టి పెట్టాలని సిఎం అన్నారు. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగిచుంకోవాలన్నారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టర్లలో విస్తరించి ఉండగా….ఇందులో ప్రస్తుతం 68.14 శాతం పచ్చదనం ఉంది. దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.