తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 23న వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులను తప్పించి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 22వ తేదీన వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించారు. సంప్రదాయంగా ఉగాది, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. దీంతో ఆరోజు నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

