వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి

వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యాన్ని బుధ‌వారం ఆయ‌న సందర్శించి విశ్వవిద్యాలయ కార్యాకలాపాలపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యాన్ని టీటీడీ 2006లో ప్రారంభించింద‌న్నారు. అప్ప‌టి నుండి వేద విద్య‌లో ఉన్న‌త‌స్థాయి ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయ‌న్నారు. వేద ప‌రిశోధ‌న‌లో భాగంగా వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. త్రికోణ‌మితి, వేదిక్ మ్యాథ్స్, ఖ‌గోళ‌శాస్త్రం వంటి అంశాలు వేదాల్లో ఉన్న‌వేన‌ని తెలిపారు. సాధార‌ణ ప్ర‌జ‌లంద‌రికీ ఈ విష‌యాలు తెలియాల్సిన అవ‌స‌రం ఉందన్నారు.

ఐఐటీ సహకారంతో ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో ఉన్న విజ్ఞానాన్ని నేటి యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వేద విద్య వ్యాప్తికి ఆరు వేద పాఠ‌శాలు ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. వేద విశ్వ‌విద్యాల‌యం ద్వారా వేద పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్రాచీన తాళ పత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి, డిజిట‌లైజేష‌న్ చేసేందుకు త‌గిన చర్యలు తీసుకుని తద్వారా వాటిని జాగ్రత్తగా భద్రపరచాల‌ని సూచించారు. భ‌విష్య‌త్తులో కూడా వేదాల్లోని సైన్స్ ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చి హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్షణకు కృషి జరుగుతుందని తెలియ‌జేశారు. అనంతరం ఆయన విద్యార్థుల తరగతి గదులు, హాస్టళ్లు, రికార్డింగ్ స్టూడియో, తాళపత్ర గ్రంథాలు పరిశీలించారు. ఈ క్రమంలోనే వేద వాంగ్మయమునకు చెందిన శుక్ల యజుర్వేద వాజసణీయ ప్రాది సాఖ్యము’, ‘సేవది’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు.

Share this post with your friends