
భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద శనివారం టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని, ఎక్కడైతే స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన, క్రమశిక్షణ బాగున్నట్లు అనే నానుడి ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమలలో 24 గంటల పాటు 1200 మంది సిబ్బంది నిరంతరంగా పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు.
తిరుమలలో గత ఏడు నెలలుగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లు తెలిపారు. మరో 40వేల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రాబోయే రెండు నెలల్లో పూర్తిస్తాయిలో తొలగిస్తామన్నారు. రుమలలో రోజుకు 78 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్త ప్రోగవుతోందన్నారు. తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా జూన్ నెల నుంచి 45 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 1.5 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసి తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో రథ సప్తమి రోజున భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో పారిశుద్ధ్యంపై 97శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారీగా వ్యర్థాలు ప్రోగైనప్పటికీ మరు క్షణంలోనే చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, భక్తులందరూ టీటీడీ సూచనలను పాటించి క్రమశిక్షణతో చెత్తను వేరు చేసి సూచించిన చెత్త కుండీలలో వేస్తే పారిశుద్ధ్య సిబ్బందికి పని చేయడం సులువవుతుందని తెలియజేశారు.
