
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి కాకుండా.. తమ ఇష్టానుసారంగా ఏ సమయంలో పడితే ఆ సమయంలో దర్శనాలకు వెళుతున్నారు. దీని కారణంగా సమయానికి వెళ్లిన భక్తులు సైతం ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పైగా దర్శన సమయం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ కీలక సూచన చేసింది. నిర్దేశించిన సమయం ప్రకారమే శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూలైన్‌లోకి రావాలని టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశాం. అయినప్పటికీ ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగడమేకాకుండా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ కోరుతోంది.
