తిరుమలకు నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఎప్పుడైనా వారికి అత్యవసర సేవలు అవసరం కావొచ్చు. ఈ తరుణంలో భక్తులకు అవసరమైన అత్యవసర సేవలను అందించేందుకు సిబ్బందికి తిరుమల తిరుపతి దేవస్థానంశిక్షణనిస్తోంది. టీటీడీ ఉద్యోగులకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ప్రారంభమైంది.
టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్ కుసుమ కుమారి ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, శ్రీవారి ఆలయ సిబ్బందికి సీపీఆర్ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించడానికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. మంగళవారం కూడా ఈ శిక్షణ మరి కొంతమంది ఉద్యోగులకు కొనసాగ నుంది. స్విమ్స్ సీపీఆర్ టీం, అశ్విని ఆస్పత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.