స్వామీజీ ఆరోపణలపై స్పందించిన టీటీడీ

శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ.. తిరుమల ఈవోపై చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. అసలు ఏం జరిగిందనే విషయాలను వివరించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా, కృష్ణాపురం గ్రామంలోని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ వారు తిరుపతిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తాము అడిగిన దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదని తద్వారా మమ్మల్ని అవమానించారని ఆరోపించడం జరిగింది. దీనిపై టీటీడీ స్పందించింది.

‘‘వాస్తవంగా సదరు స్వామీజీవారు 50 మందికి బ్రేక్ దర్శనం , 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం తో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారు. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించాం. అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆరోజున దర్శనం కోసం ఇంత మందికి ఇవ్వడం సాధ్యం కాదని 600 మంది సంఖ్య‌ను తగ్గించాలని అద‌న‌పు ఈవో కోరారు. అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జ‌రిగింది. తాము అడిగినంత‌మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లు ఇవ్వ‌లేద‌నే కోపంతో మీడియా సమక్షంలో టీటీడీ అధికారిని తీవ్ర‌స్థాయిలో కించపరుస్తూ మాట్లాడం స్వామీజీగారి స్థాయికి త‌గ‌ద‌ని తెలియ‌జేస్తున్నాం’’ అని టీటీడీ తెలిపింది.

Share this post with your friends