తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక మీదట శ్రీవారి దర్శనం లో ఏఐఐ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ క్రమంలోనే ప్రతి భక్తుడికి శాశ్వత ఐడీ కార్డును ఇవ్వనుంది. ఇదే సమయంలో తిరుమల విజన్-2047 అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. దీనిలో భాగంగా అలిపిరి వద్ద 15 హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇకమీదట అలిపిరి వద్దే వసతితో పాటు అన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా తిరుమలలో పెరుగుతున్న వాహన రద్దీని నియత్రించడంలో భాగంగా నూతన ప్రణాళికలను టీటీడీ రూపొందిస్తోంది. తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడం కష్టంగా మారింది.
తిరుమలలో భక్తుల కోసం 7,790 టీటీడీ గదులు, 1,105 మఠాల గదులు, 6,800 లాకర్లు ఉన్నాయి. నిత్యం తిరుమలకు దాదాపు 70 వేల మందికి పైనే వస్తుండగా.. వీటన్నింటి ద్వారా కేవలం 55 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంది. దీంతో మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ క్రమంలోనే బేస్‌క్యాంప్ ప్రాజెక్టుపై టీటీడీ ఫోకస్ పెట్టింది. గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన సూచిక కూడా రద్దు చేసి టీటీడీకే కేటాయించడంతో బేస్‌క్యాంప్‌కు లైన్ క్లియర్ అయింది. దీని ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో శరవేగంగా బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
వాహనాలన్నీ బేస్‌క్యాంప్ దగ్గర ఆగాల్సిందే..
వివిధ ప్రాంతాల నుంచి తిరుమల కోసం అలిపిరి వద్దకు వచ్చే ప్రైవేట్ వాహనాలను ఈ బేస్‌క్యాంప్‌కు మళ్లిస్తారు. అక్కడి నుంచి భక్తులను టీటీడీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ మోడల్ ట్రాన్స్‌ఫర్ టెర్మినల్ ద్వారా కొండపైకి పంపిస్తారు. బేస్‌క్యాంప్ దగ్గరే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. విశ్రాంతి తీసుకొనేందుకు, స్నానాలు, భోజన హాళ్లు, లాకర్లు వంటివన్నీ ఉంటాయి.