
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పోటు కార్మికులు, కాంట్రాక్టు లెక్చరర్లు ఖుషీఖుషీగా ఉన్నారు. దీనికి కారణం వీరందరికీ జీతాలు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకోవడమే. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోటు కార్మికులకు జీతాలు పెంపు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
దీంతో పోటు కార్మికులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో పలువురు పోటు కార్మికులు, టిటిడి కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
