వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యతపై ఆరా తీసిన టీటీడీ ఈవో..

తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్థోపెడిక్స్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడికి విచ్చేసి మెరుగైన చికిత్సలు పొందాలని టీటీడీ ఈవో ఈవో జె.శ్యామలరావు చెప్పారు. బుధవారం ఈవో, అధికారులతో కలిసి బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బర్డ్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. రోగులకు ఓపి, ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల అమరిక వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోకీలు మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు.

అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్సరే, స్కానింగ్, ఓపి వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు బర్డ్ వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా బర్డ్ లో అందిస్తున్న వైద్య సేవలను ఈవోకు వివరించారు. తర్వాత బర్డ్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు.

Share this post with your friends