తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధం. ఈ విషయమై ఎన్నో సార్లు భక్తులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా విమానాల రాకపోకలు సాగుతూనే ఉన్నాయి.తాజాగా విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని టీటీడీ చైర్మన్ లేఖలో తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గంగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టీటీడీ చైర్మన్ కోరారు.