తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవల్సిన వార్త ఇదే..

తిరుమలకు వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవల్సిన వార్త ఇది. శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా టిటిడి అధికారులతో సమీక్షించారు.

సమావేశంలోని కొన్ని ముఖ్యాంశాలు:

శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్లుజరీ ప్రక్రియ టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది.

తమ ఆధార్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి.

శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు.

ఇదే సమయంలో మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు .

భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .

భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

Share this post with your friends