తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. గత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించనున్నారు. 2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవలసి ఉంటుంది.
అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన శ్రీ సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు సోమవారం టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతి లో టీటీడీ ఈవో శ్రీ J . శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈవో, అదనపు ఈవో అభినందించారు.