
తిరుమలలో ఆదివారం రాత్రి మాఘ శుద్ధ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రతి పౌర్ణమి నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఈ మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది కావడంతో ఈ పౌర్ణమి గరుడ సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం అని అంటారు. అంటే పౌర్ణమి గరుడసేవను తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని చెబుతారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
