తిరుమల శ్రీవారి ఆలయంలోని శాసనాలను అనువదించి ఆలయ చరిత్రను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని ప్రముఖ పరిశోధకులు శ్రీ కృష్ణారెడ్డి చెప్పారు. శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 136వ జయంతి సందర్భంగా మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసిన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి స్వామివారికి అనన్య సేవ చేశారన్నారు.
రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు. టీటీడీలో చిన్న స్థాయి అధికారిగా ఉంటూ వెయ్యికి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరపడం ఆనందంగా ఉందన్నారు. డీసీపీ ప్రాజెక్టు అధికారి శ్రీ రాజగోపాల్ మాట్లాడుతూ, శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు చెప్పారు. ఆయన సేవలను ప్రతి ఏడాదీ స్మరించుకుంటున్నామని వివరించారు.