ఘనంగా తిరుమలనంబి తన్నీరముదు ఉత్సవం

తిరుమలలో ఘనంగా తన్నీరముదు ఉత్సవాన్ని నిర్వహించారు.అధ్యయనోత్సవాల ముగింపు రోజైన గురువారం ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ‘తన్నీరముదు’ ఉత్సవం తిరుమలలో గురువారం ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేస్తారు.

తిరుమలనంబి ఆలయం నుంచి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకొస్తారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు. అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ‘తిరుమొళి పాశురాలను’ పారాయణం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends