తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కటాక్షం

తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రులు కావచ్చని, వేదాల సార‌మే తిరుప్పావై అని తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి చెప్పారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమ‌వారం సాయంత్రం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్ల‌లో గోదాదేవి ఒకరిని చెప్పారు. గోదాదేవి అన‌న్య‌మైన భ‌క్తిభావ‌న‌తో భ‌గ‌వంతుని కీర్తిస్తూ పాశురాలు ర‌చించార‌ని తెలిపారు. ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం చేస్తే పాపాలు నశించి పుణ్యం సిద్ధిస్తుందని తెలిపారు.

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ మాట్లాడుతూ కైంకర్యాలనే పరమావధిగా భావించి స్వామి సేవలో తరిస్తున్న చిన్నజీయర్ స్వామి ఈ కార్యక్రమానికి విచ్చేయడం సంతోషకరం అన్నారు. సూర్యుడు ధ‌ను రాశిలో ప్ర‌వేశించ‌డాన్నే ధ‌నుర్మాసం అంటార‌న్నారు. ఈ మాసంలో బ్ర‌హ్మ ముహూర్తంలో భ‌గ‌వంతుని ఆరాధిస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీమతి ద్వారం వి.జె.లక్ష్మీ రచించిన ‘అనలిటికల్ స్టడీ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ తిరుప్పావై పాశురమ్స్’ పుస్తకాన్ని శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి విడుదల చేశారు. కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ చే ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పై ప్రవచనం ఉంటుంది. శ్రీ‌మ‌తి ద్వారం వి.జె.లక్ష్మి పాశురాల‌ను గానం చేస్తారు.

Share this post with your friends