శ్రీ పెరియ కోయిల్ కేల్వియప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామివారికి బుధవారం టీటీడీ స్థానిక ఆలయాల్లో పెద్దమర్యాదలు జరిగాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామీజీకి టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏ&సీఏఓ శ్రీ బాలాజీ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలకు విచ్చేసిన స్వామీజీ సాంప్రదాయం ప్రకారం దర్శించుకున్నారు.
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్ స్వాములు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.