కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనున్నాయి. మొదటిరోజైన జనవరి 28న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉదయం 9.30 గంటలకు ప్రముఖ పీఠాధిపతులు మంగళా శాసనములు అందిస్తారు. రెండవ రోజైన జనవరి 29న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. చివరిరోజు జనవరి 30న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు.
28న తిరుపతిలో “హరిదాస రంజని”
జనవరి 28న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హరిదాస రంజని గోష్టిగానం నిర్వహించనున్నారు.
టీటీడీ పరిపాలన భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2025 జనవరి 25: తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జనవరి 26వ తేదీ ఆదివారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరిపాలన భవనం వెనక వైపున గల పరేడ్ మైదానంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ జె.శ్యామలరావు ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులను అందజేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.