అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం, సాయంకాలం వేళ వివిధ వాహనాలపై దేవేరులతో కలిసి ఊరుగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. శుక్రవారం రాత్రితో అశ్వవాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి.
ముందుగా ఆలయ అర్చకులు. స్వామిపుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించిన అనంతరం చక్రతాళ్వార్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చక్రస్నానం రోజున పుష్కరిణిలో భక్తులు స్నానాలు నిర్వహిస్తే సకల పాపాలు తొలగుతాయని నమ్మకం. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారు జామున 3 నుంచి 6 గంటల వరకూ మాఢవీధుల్లో వేడుకగా స్వామివారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. టీటీడీ సైతం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కీలక ఏర్పాట్లు చేసింది. 600 మందితో బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించింది. ఇవాళ రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరించనున్నారు.