భక్తులకు సంతృప్తికర దర్శనం.. ప్రతి ఒక్కరికీ టీటీడీ ప్రత్యేక అభినందనలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవను టీటీడీ అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామల రావు తెలియజేశారు. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన రాంభగిచా రెస్ట్ హౌస్ వద్ద టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశాఖ చాలా బాగా పని చేసిందనీ, మరుగుదొడ్ల విషయం మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు. గరుడ సేవ అయిపోయిందని ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండకూడదని, మిగిలిన వాహన సేవలకు కూడా కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమవుతాయని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత అధికంగా ఉందని, వచ్చే బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లోని భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అడిషనల్ ఈఓ శ్రీ సీహెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి వాహన సేవను కూడా గరుడ సేవ లానే భావించి సేవలు అందించాలన్నారు. రాబోయే రోజుల్లో గ్యాలరీల వద్ద మరిన్ని శాశ్వత మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మరో వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాలరీ సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించి చర్యలు చేపడతామన్నారు. బ్రహ్మోత్సవాలకు అనుభవం ఉన్న శ్రీవారి సేవకులను తీసుకుంటే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మాడ వీధుల్లో భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై గందరగోళం ఉందని దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గరుడ వాహన సేవలో క్యాటరింగ్ విభాగం చాలా బాగా పని చేసిందని అభినందించారు. విజిలెన్స్ సిబ్బంది కూడా సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించారన్నారు.

Share this post with your friends