తిరుమల శ్రీవారి దర్శనానికి గతంలో తెలంగాణ ప్రతినిధుల సిఫారసు లేఖలను సైతం అనుమతించేవారు. ఆ తరువాత ఎన్నికలు నూతన ప్రభుత్వం ఏర్పడటం వంటి పరిణామాల కారణంగా వాటిని నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావొస్తున్నా కూడా అనుమతించక పోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమలలోే భక్తులకు దర్శనం, వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను సైతం పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదం తెలిపింది.
అయితే నిత్యం అనుమతించరు. వారంలో కేవలం రెండుసార్లు మాత్రమే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణకు చెందిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై కొందరు తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఏపీ సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.