తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షణకాల దర్శనం కోసం భక్తులు కొన్ని సార్లు 48 గంటల పాటు క్యూలైన్లలోనే వేచి ఉంటారు. కానీ ఇక మీదట అలా వేచి ఉండే అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా కల్పించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఏఐలో ఎక్స్‌పర్ట్ అయిన విదేశీ ప్రతినిధులతో టీటీడీ సంప్రదింపులు జరుపుతోంది. దీనిని ప్రయోగాత్మకంగా అమలు జరపనుంది. రోజుకు సగటున 70 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వీరందరికీ ఇకపై గంటలో దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
గంటలో శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించే విషయమై సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తొలి పాలక మండలి సమావేశంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. మరోవైపు ఏఐలో నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ 24న తిరుమలలో జరిగే పాలకమండలిలో చర్చకు తీసుకురానన్నట్టు సమాచారం. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుడి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ద్వారా దర్శన సమయాన్ని నిర్ధారించి, టోకెన్లు జారీ చేసే అంశంపై చర్చ నిర్వహించనుంది. ఇలా సమయానుసారంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే అక్కడ ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ లో స్కానింగ్ చేసి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది.