తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దేశ వ్యాప్తంగా లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు పెను సంచలనం సృష్టించాయి. గత ప్రభుత్వ పాలనలో నెయ్యి అందించిన ఒక సంస్థపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి ఇప్పటి టీటీడీ ఈవో చెక్ పెట్టారు. పరీక్షలు చేసి మరీ నెయ్యి నాణ్యతను నిర్ధారించి మరీ సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత కూడా పెరిగిందంటూ భక్తులు చెబుతున్నారు.
ఇక కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు గురువారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి, శ్రీ కేఎంఎఫ్ ఎండి శ్రీ ఎంకె జగదీష్, డైరెక్టర్లు శ్రీ రఘునందన్, శ్రీ రాజశేఖర్ మూర్తి, శ్రీ మంజునాథ్ పాల్గొన్నారు.