
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ కళాశాలల ఎన్‌సిసి విద్యార్థిని విద్యార్థులు అశ్వాలతో ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుడ్ లక్, రోమన్ ఫ్లేమ్, గగన్, ఫైటర్, రాణి ఝాన్సీ అనే పేర్లు గల అశ్వాలతో ఎన్‌సిసి క్యాడెట్లు పలు విన్యాసాలు చేశారు. మొదటగా జాతీయ జెండా, ఎన్‌సిసి జెండా, టిటిడి జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా, టెంట్ పెగ్గింగ్, షో జంపింగ్ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాండీ, శింబా, బిందు, విరాట్, బ్యూటీ, ఆస్కార్ అనే జాగిలాలు పాల్గొన్నాయి. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి గౌరవ వందనం చేయడం, గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.
