తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ నెల 9న శ్రీవారికి పుష్పయాగం నిర్వహించనుంది. ఈ పుష్పయాగానికి 8వ తేదీన అంకురార్పణ నిర్వహించనుంది. ఈ క్రమంలోనే 8, 9 తేదీల్లో పలు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. శ్రీవారి కల్యాణోత్సవంతో పాటు ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది. అలాగే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా మాత్రమే నిర్వహించనుంది. ఈ క్రమంలోనే 8వ తేదీ సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఈ నెల 9వ తేదీన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన తొలుత స్వామివారికి రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలు సమర్పించనున్నారు. ఆ తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేయనున్నారు. అనంతరం పుష్పయాగం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం సహస్రదీపాలంకార సేవ నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.