శ్రీవారి పుష్పయాగాన్ని ఎలా నిర్వహిస్తారంటే..

తిరుమలలో ఇవాళ వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో శ్రీవారి వార్షిక పుష్పయాగానికి శుక్రవారం రాత్రి అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. శనివారం నాడు పుష్పయాగాన్ని పురస్కరించుకొని ముందు రోజున వసంత మండపంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పుష్పయాగానికి మొత్తంగా 8 టన్నుల పుష్పపత్రాలను వినియోగిస్తారు. దీనికి ముందుగా ఉదయం పుష్పాల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఉద్యానవన విభాగం కార్యాలయం నుంచి శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం వరకూ పుష్పాల ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తారు. మరోవైపు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేస్తారు. చామంతి, సంపంగి, జాజి, పొగడ, గులాబి, గన్నేరు, కనకాంబరం, మల్లెలు, తామర, కలువ, మొగలి, సంపంగి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం తదితర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, కదిరిపచ్చ పత్రాలతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజిస్తారు.

Share this post with your friends