
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
శ్రీ ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
విశాఖపట్నంలో హెచ్‌పీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీ పి.ఎస్.రవికుమార్ దంపతులు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,00,116 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు డిడిని తిరుమల టిటిడి అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
