వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ జె.శ్యామల రావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తాం.
ఆన్‌లైన్ దర్శన టికెట్ల వివరాలు
1.40 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను డిసెంబరు 24న ఆన్‌లైన్‌లో విడుదల చేశామని ఈవో తెలిపారు. శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులలో రోజుకు 2000 టికెట్లు, గదుల కోటాను డిసెంబరు 23న ఆన్‌లైన్‌లో విడుదల చేశామన్నారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుందన్నారు.
దాతలకు దర్శనం, బస
ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామని ఈవో తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల వివరాలు
తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు. తదుపరి రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.