తొందరపడి అసత్యాలు ప్రచారం చేయకండి: టీటీడీ చైర్మన్

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో సోమవారం టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవోలతో కలసి టీటీడీ ఛైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు పాదర్శకంగా సేవలు అందించేందుకు పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుండవచ్చనేమో కాని, ఆలస్యం అవుతోందని తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాను విజ్ఞప్తి చేశారు.

తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీ ఛైర్మెన్ కు, ఈవో శ్రీ శ్యామల రావుకు మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు. వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు. విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలలో మరింత నాణ్యతగా అందించామన్నారు. తిరుపతిలో జరిగిన తోపులాట సంఘటన జరగడం సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, తమను, దేశాన్ని, ప్రపంచాన్ని భాధించిందన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు , తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. చిన్న పొరపాట్లు చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామన్నారు.

Share this post with your friends