తిరుమల తిరుపతి శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను టీటీడీ మాజీ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి కుప్పాల గిరిధర్ కుమార్ విరాళంగా అందజేశారు. గురువారం తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిని కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి చెక్ ను అందజేశారు. శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఎందరికో విశిష్ట సేవలందిస్తోందని గిరిధర్ పేర్కొన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ నూతన సంవత్సరం ప్రారంభం నుంచే ఒక్కసారిగా పెరిగింది. కొత్త ఏడాది ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో భక్తులు కంపార్ట్ మెంట్లలో పూర్తిగా నిండిపోయి గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో తిరుమల రద్దీ పెరుగుతూనే ఉంటుంది. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే లక్షల్లో టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ నెల 10 నుంచి 19 వరకూ వైకుంఠం ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు దేశ, విదేశాల నుంచి తరలి వస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది. సిఫార్సు లేఖలను సైతం అనుమతించబోమని టీటీడీ ఇప్పటికే వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్లన్నీ క్షణాల్లో అమ్ముడు పోయాయి. అలాగే మరో లక్ష టికెట్లను తిరుమల, తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ విక్రయించనుంది.