తిరుమల తిరుపతి దేవస్థానం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. దీనికోసం సంప్రదించాల్సిన నంబర్‌ను సైతం టీటీడీ తెలిపింది. భక్తులు తమ సందేహాలు, సలహాల కోసం 0877-2263261 నంబర్‌లో సంప్రదించాల్సి ఉంటుంది.
వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకూ లైనులో వేచి ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది. రద్దీ నేపథ్యంలో భక్తులు శుక్రవారం ఉదయం సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ప్రవేశించాలని మైక్‌సెట్లలో విజ్ఞప్తి చేశారు. క్యూలైన్‌లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా పాలు, నీరు, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు.