కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇకపై ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు

తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్‌తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని తెలిపారు.

గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఈవో తెలిపారు. తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టి, స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా, దర్శనం టోకెన్లు లేనివారికి ఆధార్ కార్డుపై రోజువారి రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి మేము పంపలేకపోయామన్నారు. ప్రస్తుతం పంపిస్తున్నామన్నారు. గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు పంపబడ్డాయన్నారు. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ.50/- ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు (స్టాక్ లభ్యత ఆధారంగా) అందజేస్తున్నామని ఈవో తెలిపారు. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదన్నారు. ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు, సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామన్నారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా నెయ్యి యొక్క నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నెయ్యి కల్తీనా కాదా తెలుసుకునే దానికి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఒక గ్యాస్ క్రోమాటోగ్రాఫ్, హెచ్‌పిఎల్‌సిని విరాళం అందిస్తామని తెలిపారని వెల్లడించారు. దీని ధర సుమారు రూ.80 లక్షల వరకూ ఉంటుందన్నారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరుస్తారని ఈవో వెల్లడించారు.

అన్నప్రసాదం నాణ్యతను మెరుగుపరిచేందుకు, ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుందన్నారు. అదేవిధంగా, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నరాు. ఆ కమిటీ నివేదిక 15 రోజులలో వస్తుంది. నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

Share this post with your friends