వారందరికీ డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికులకు ఒక ప్రత్యేక రోజున దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా దర్శన టోకెన్లు మంజూరు చేసే తేదీలో మార్పులు చేసింది. డిసెంబర్ 2న తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనుంది. టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును జారీ చేయనున్నట్లు ప్రకటించినా, నిరంతరాయ వర్షాల కారణంగా ఈ తేదీని డిసెంబర్ 2 కు మార్పు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి సదరు కేంద్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలియజేయడమైనది.

Share this post with your friends