తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించేందుకు తన ప్రతిరోజు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం వైకుంఠం కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా, యాత్రికులకు వివిధ సమయాల్లో అందజేస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించే నిర్దేశిత సమయాలను పరిశీలించారు. అదేవిధంగా కంపార్ట్‌మెంట్ల విడుదల సమయాన్ని పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ సురేంద్ర, ఏఈఓలు శ్రీ శ్రీహరి, శ్రీ మునిరత్నం, ఏవీఎస్‌వో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కాగా.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా విడుదలైంది. వీటి కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చు. ఇక రేపు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవా టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు. 27న ఉదయం 11 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించి శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.