గోవిందునికి అరుదైన విరాళం

ఏడుకొండల్లో కొలువైన వెంకన్నకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వారు టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు ఇస్తారు. అలాగే పేదల కోసం టీటీడీ నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలల్లోనూ భాగస్వాములుగా ఉంటారు. అయితే సోమవారం శ్రీవారికి అందిన విరాళం చాలా అరుదైనదిగా నిలిచిపోయింది. భారత్ సహా పలు దేశాల్లో విపత్తు అధికారిగా సేవలు అందించిన ఓ మహిళ, తన జీవితంలో ఆదా చేసిన ప్రతి పైసాను వెంకన్నకు కానుకగా సమర్పించారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమం కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. రేణిగుంటకు చెందిన శ్రీమతి సి.మోహన భారతదేశంతో పాటు కాసావో, అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియాలలో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

ఉద్యోగరీత్యా ఆమె ఎక్కడ పనిచేస్తున్నా, గోవిందుని నామస్మరణను మాత్రం మర్చిపోలేదు. అంతేకాదు, తన వృత్తిజీవితంలో ఆదా చేసిన ప్రతి రూపాయిని శ్రీవారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విధంగా ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాస్(ఎస్వీ బాలమందిర్) ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆ మొత్తాన్ని డీడీ రూపంలో తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరికి అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని వెంకయ్య చౌదరి కొనియాడారు. మూడున్నర దశాబ్దాలకుపైగా తన వృత్తి జీవితంలో సంపాదించిన ధనాన్ని, గోవిందుడి కృపతో అనాథలు, పేదలకు ఉపయోగపడాలనే ఆమె నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు. సునామీ విధ్వంసం సమయంలో శ్రీమతి మోహన ధైర్యసాహసాలతో తన సేవలు అందించారు. 1982-94 మధ్య పలు దేశాలలో అనేక భూకంపాలు, తుఫానులు కలిగించిన కష్టాల్లో కూడా ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటిష్ ఛారిటీలతో కలిసి పనిచేసి ప్రజలకు తన వంతు సాయం అందించారు. ఇప్పుడు కూడా శ్రీవారి ద్వారా పేద ప్రజలకు తన సంపాదన ఉపయోగపడాలని భావించి, అరుదైన విరాళాన్ని అందించారు.

Share this post with your friends